“అసత్యం ద్వారా సత్య దర్శనం #గీతా ---భాగవత సమన్వయం” 4 వ రోజు
సత్యం అంటే మూడు కాలాల్లోనూ, అన్ని లోకాలలోనూ ఉన్నది — అదే పరమాత్మ. ఉపనిషత్తులు “సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ” అని చెప్పినది ఇదే. అది కాలానికి, స్థలానికి, వస్తువుకి పరిమితం కాని పరిపూర్ణమైన సత్యం. ఈ సత్యాన్ని తెలుసుకోవాలంటే ఒక సాధనం అవసరం. అదే ధర్మం. ధర్మం అంటే కేవలం కర్మలు కాదు; సత్యాన్ని ధరించి మనకు చూపించే సాధనం. అందుకే ఈ జగత్తే ధర్మం — ఎందుకంటే ప్రపంచం పరమాత్మను ధరించి ఉన్నది. కానీ మన అజ్ఞానం వల్ల మనం ప్రపంచాన్ని పరమాత్మకు వేరుగా చూస్తున్నాం. దాని వల్ల రెండు నష్టాలు కలుగుతున్నాయి — ప్రపంచం నిజమైన అర్థంలో కనిపించదు, పరమాత్మ కూడా గుర్తుకురాడు. వాస్తవానికి ఈ జగత్తు అసత్యంలా కనిపించినా, అది సత్యాన్ని చూపించే మార్గం. మార్గం గమ్యానికి తీసుకువెళ్లినట్లే, ప్రపంచం పరమాత్మను తెలుసుకునే సాధనం. మనలో ఉన్న జీవుడు కూడా పరమాత్మ యొక్క అంశమే. అందుకే భగవద్గీత చెబుతుంది — “మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః”. ఈ సత్యాన్ని మనకు గుర్తు చేయడానికి మహర్షి వ్యాసుడు పురాణాలు, మహాభారతం వంటి గ్రంథాలను రచించాడు. అవి కేవలం కథలు కాదు; సత్యాన్ని తెలుసుకునే మార్గదర్శకాలు. అందువల్ల అసత్యంలా కనిపించే ఈ జగత్తును సత్యానికి దారి...