మాయా నగరం నుంచి ఆత్మ స్వస్థత వరకు -వేదాంత పంచదశి
మొదటి భాగం – సారాంశం ఈ పాఠ్యం చెప్పేది ఒకే విషయం: ఈ ప్రపంచం “ఉంది” అని కూడా చెప్పలేము, “లేదు” అని కూడా చెప్పలేము. ఈ మధ్యస్థితినే ఉపనిషత్తులు మాయ అంటాయి. ఉందని ఎందుకు చెప్పలేమంటే — లోతుగా వెళ్ళి చూస్తే దీనికి స్వతంత్ర ఆధారం లేదు. లేదని ఎందుకు చెప్పలేమంటే — కనిపిస్తుంది, అనుభవంలోకి వస్తుంది, ప్రభావం చూపిస్తుంది. అందుకే దీనిని సదసత్తు అన్నారు. సత్ + అసత్ = సదసత్తు. ఇది పరస్పర విరుద్ధం లాగా కనిపిస్తుంది. కానీ పరస్పర విరుద్ధం ఎక్కడ కనిపిస్తుందో, అక్కడే మాయ మొదలవుతుంది. భగవద్గీత స్పష్టంగా చెబుతుంది: సత్ నేనే – అసత్ నేనే. అంటే ఉనికీ నేను, లేనితనమూ నేనే. సూర్యుడు – అతని ప్రకాశం వేరు కాదన్నట్లే, సత్ – అసత్ వేరు కాదు. ఒకటి అవ్యక్తం, మరొకటి వ్యక్తం. అసత్ అంటే “ఏమీలేదు” కాదు. అసలు లేనిదైతే మన ఆలోచనకే రాదు. మన మనస్సులోకి ఏదైనా వస్తే — అది ఎక్కడో ఒక రూపంలో ఉండే తీరాలి. అందుకే ప్రపంచం పూర్తిగా అబద్ధం కాదు. కానీ స్వతంత్ర సత్యం కూడా కాదు. ఇదే మాయ యొక్క స్థితి. వశిష్ట కథ – లోతైన సంకేతం వశిష్ట మహర్షి రాముడికి చెప్పిన ముగ్గురు రాజకుమారులు – లేని పట్టణం కథ ఒక బాలుడికి చెప్పే కథలా కనిపించిన...